ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ
Showing posts with label kids. Show all posts
Showing posts with label kids. Show all posts

Friday, May 7, 2010

వరుసగా మూడు....చెప్పేస్తా చూడు!


వరుస అంకెల్తో ఇలా మాయ చెయ్యండి .
మీ స్నేహితుడిని 1 నుంచి 9 లోపు మూడు వరస అంకెల్ని తల్చుకోమనండి. వాటిలో మొదటి రెండూ ఒకదాని పక్కన ఒకటి వేస్తే రెండంకెల సంఖ్య వస్తుంది కదా? అలా చివరి రెండు, చివరిదీ మొదటిదీ అదే వరుసలో వేయమనండి. అంటే అతడి దగ్గర మూడు సంఖ్యలు వుంటాయి. ఆ మూడింటిని కలిపి చెప్పమనండి. ఆ జవాబు వింటూనే మీరు అతడు తల్చుకున్న మూడు వరస అంకెలనూ చెప్పేయగలుగుతారు!

కిటుకు: అతడు చెప్పిన జవాబును మీరు 33 చేత భాగించాలి. (ముందు 3 చేత, తరువాత 11 చేత భాగిస్తే సులువు) అలా వచ్చిన జవాబులో నుంచి 1 తీసేస్తే అది అతడు తల్చుకున్న వాటిలో మొదటిది అవుతుంది.

వివరణ: ఉదాహరణకు మీ మిత్రుడు 5,6,7 తీసుకున్నాడనుకుందాం. వాటిలో మొదటి రెండంకెలతో 56, చివరి రెండంకెలతో 67,చివరిదీ మొదటి దానితో 75 వస్తాయి. వీటి మొత్తం 56+67+75=198 వస్తుంది. ఇది చెప్పగానే మీరు దాన్ని 33 చేత భాగిస్తే 6 వస్తుంది. అందులోంచి 1 తీసేస్తే 5 వస్తుంది. మీ మిత్రుడు తల్చుకున్న వరస అంకెల్లో అది మొదటిదేగా!

Thursday, May 6, 2010

పుట్టిన వారం చెప్పేస్తా



పిల్లలకి వేసవి సెలవులలొ సరదాగా ఇలా అంకెలతో గారడి చేయవచ్చు.

మీ స్నేహితుడి చేత ఓ లెక్క చేయించి అతడు ఏ వారం పుట్టాడో చెప్పి ఆశ్చర్యపరచండి.ముందుగా మీ స్నేహితుడిని ఏవైనా మూడు వరస సంఖ్యలని తల్చుకోమనండి. ఆ మూడు కూడి వచ్చిన జవాబును 3 చేత గుణించమనండి. ఆ జవాబుకి అతడు పుట్టిన వారాన్ని సూచించే అంకెను కలపమనండి. (అంటే 1.ఆదివారం 2.సోమవారం 3.మంగళవారం 4.బుధవారం 5.గురువారం 6. శుక్రవారం 7.శనివారం అన్నమాట). అలా కలిపాక ఆ జవాబును పైకి చెప్పమనండి. దాన్ని వింటూనే మీరు అతడు పుట్టిన వారాన్ని చెప్పగలుగుతారు.

కిటుకు: అతడు చెప్పిన జవాబులో అంకెలన్నింటినీ ఒకదానికి ఒకటి కలిపేయండి. ఇలా ఒకే అంకే వచ్చేవరకు చేస్తే అది అతడు పుట్టిన రోజును సూచిస్తుంది.

వివరణ: ఉదాహరణకి మీ మిత్రుడు 15,16,17 తలుచుకున్నాడనుకుందాం. మీ సూచనల ప్రకారం అతడు వాటిని ఒకదానికొకటి కూడితే 15+16+17=48 వస్తుంధి. దాన్ని 3 చేత గుణిస్తే 144 అవుతుంది. అతడు పుట్టిన వారం గురువారం అనుకుందాం. దాన్ని సూచించే అంకె 5 కాబట్టి అతడు దాన్ని 144కి కలిపి మొత్తం 149 అని మీకు చెబుతాడు. మీరు వెంటనే మనసులొ ఇందులోని అంకెల్ని ఒకదానికొకటి కలిపేస్తారు. మొదట 14, ఆ పై వాటిని కుడా కలిపేస్తే 5 వస్తాయి. వెంటనే గురువారం అని చెప్పేస్తారంతే.